పుదీనా తైలం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. పుదీనాలో నాలుగు ముఖ్యమైన తెగలున్నాయి. అవేమనగా జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్ మెంట్ పుదీనా మరియు బర్గామెట్ పుదీనా.
ఇందులో మనదేశంలో జపాన్ పుదీనాకు ఎక్కువ గిరాకి ఉన్నది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలా, దగ్గు, జలుబు మరియు నొప్పులను తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
అంతేకాక టూత్ పేస్ట్ లు, మౌత్ వాష్ మొదలగు వాటిలో వాడుతున్నారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు.
నేలలు: ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6-7.5 ఉన్నచో అనుకూలం.
నాటటం: దీనిని వేర్ల ద్వారా, కాండపు ముక్కల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 – 4 క్వింటాళ్ళ తీగ ముక్కలు అవసరం అవుతాయి. తీగ ముక్కలను 45 సెం.మీ. దూరంగల వరుసలలో నాటుకుని మట్టితో కప్పుకోవాలి. ఇవి చిగుర్లు తొడిగి తీగలు సాగుతాయి
రకాలు: శివాలిక్, హిమాలయ, కోసి మైయు సక్షమ్ అను రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి.
ఎరువులు: ఆఖరి దుక్కిలో 5 టన్నుల పశువుల ఎరువు. 50 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 15 కిలోల పొటాష్ వేయాలి. నత్రజనిని 3 ధఫాలుగా అనగా ఆఖరిదుక్కిలో సగం, 40 రోజులకు మరియు 80 – 90 రోజులకు వేసుకోవాలి.
నీటి యాజమాన్యం: ప్రతి 7 – 10 రోజులకు తప్పని సరిగా నీరు పెట్టాలి. పంటకాలంలో కనీసం 15 తడులు ఇవ్వాలి.
పంటకోత: నాటిన 120 రోజులకు మొదటిసారి, తదుపరి 60 – 70 రోజులకు కోతలు తీసుకుని నూనెబట్టీలో తైలాన్ని తీయాలి. కోత తరువాత 4 – 5 గంటలు నీడలొ ఆరబెడితే నాణ్యత బాగుంటుంది. రెండు లేదా మూడు కోతల తర్వాత తీసివేసి మళ్ళీ నాటుకోవాలి.
దిగుబడి:
ఎకరానికి పంటకాలంలో 15-20 టన్నులు, తద్వారా 70-75 కిలోల తైలం లభిస్తుంది. ఎకరానికి ఖర్చు రు.8,000-10,000 (మొదటి సంవత్సరం).రూ. 15,000 నికరాదాయం.
Comments