పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు.
వాతావరణం : ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాలకు అనువైనది. 350 సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత వచ్చిన ఎడల ఆకులు కూరగా పనికిరావు. అందువలన ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు.
నేలలు: సారవంతమైన, మురుగునీరు పోవు సౌకర్యం గల నేలలు అనుకూలం. అధిక చౌడు గల భూమిలో కూడా పాలకూర పండించవచ్చు.
రకాలు: ఆల్‌గ్రీన్ : ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. 75రోజులకు పూత వస్తుంది. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
పూసా జ్యోతి : ఇది ఆల్‌గ్రీన్ రకాన్ని అభివృద్ధి పరచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్‌గా వాడుతారు. దిగుబడి 6-8 కోతలకి 16-19 టన్నులు / ఎకరాకు.
పూసాహరీత్ : చల్లని, కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది.
పూసా పాలక్ : ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడినది. ఇది స్విస్ చార్ట్ X దేశవాళీ పాలకూర సంకరం నుండి ఎన్నుకొనబడినది. ఒకేవిధమైన లేత ఆకులను కలిగి వుంటుంది.
జాబ్‌నర్ గ్రీన్ : ఆకులు పెద్దగా, మందంగా, మృదువుగా ఉంటాయి. దిగుబడి 11-12 టన్నులు / ఎకరాకు.
ఊటీ – 1 : ఆకులు 40-50 సెం.మీ. పొడవు, 8-10 సెం.మీ. వెడుల్పుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. దిగుబడి 4 కోతలలో 24 టన్నులు / ఎకరాకు.
పంటకాలం : ఉత్తర భారతదేశం: ఖరీఫ్ : జూన్-జూలై, రబీ :సెప్టెంబర్-అక్టోబర్, దక్షిణ భారతదేశం : అక్టోబరు నుండి డిసెంబరు, చల్లని కొండ ప్రాంతాలలో : ఏప్రిల్ – జూన్.
విత్తన మోతాదు : 10-12 కిలోలు/ఎకరాకు నేల తయారీ మరియు విత్తటం : భూమిని 3-4 సార్లు బాగా దున్ని చదును చేయాలి. అనువైన పరిమాణంలో మళ్ళను తయారుచేసుకోవాలి.
విత్తే విధానం : ప్రతి పాలకూర గింజ బంతిలో 2-3 విత్తనాలుంటాయి. విత్తనాలను 20సెం.మీ.దూరంలో, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 8-10 రోజులలో గింజ మొలకెత్తుతుంది.
విత్తే దూరం : 20X10 సెం.మీ.
ఎరువులు : ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరాకు 10 కిలోల నత్రజని పైపాటుగా వేయాలి.
అంతరకృషి : విత్తిన 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో 2-3సార్లు కలుపుతీసి మట్టిని కదిలించాలి.
నీటియాజమాన్యం : విత్తిన వెంటనే నీరు పారించాలి. వారం నుండి 10 రోజులకొకసారి భూమిలో తేమను బట్టి తడులను ఇవ్వాలి. ప్రతి కోత తరువాత పైపాటుగా నత్రజని వేసి నీరు పారించాలి.
సస్యరక్షణ : ఆకు కూరల పంటకు తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులను మాత్రమే వాడాలి. పేనుబంక మరియు ఆకుతినే గొంగళి పురుగుల నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు (సెర్కొస్పొరా మచ్చ) నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందు పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.
కోత : మొదటి కోత విత్తిన 3-4 వారాలకు వస్తుంది. తర్వాత 7-10 రోజుల వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు.
దిగుబడి : 3.5 – 4.0 టన్నులు / ఎకరాకు(4-6 కోతలలో)
నిల్వ : శూన్యశక్తి శీతల గదిలో 2-3 రోజుల వరకు నిల్వ చేసుకొనవచ్చును.
Comments