ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతిలో అందుబాటులో ఉన్న వనరులతో పంటలకు అవసరమైన పోషకాలను తయారు చేసి అందించే విధానమే డాక్టర్ చోహన్‌క్యు పద్ధతి. ఆయన వద్ద శిక్షణ పొందిన రోహిణీరెడ్డి సూచనలను అనంతపురంరైతులు పాటిస్తున్నారు. ఈ విధానంలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా(ల్యాబ్), దేశీయ సూక్ష్మజీవులు (ఇండిజినిస్ మైక్రో ఆర్గానిజమ్స్ –ఐఎంవోలు) సహా పలు రకాల ద్రావణాలను పంటల సాగులో వాడతారు. వీటి వినియోగం వల్ల నేల ఆరోగ్యంగా ఉండి మొక్క ఎదుగుదల బావుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మొక్క చీడపీడలను, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది.
ల్యాబ్ తయారీ పద్ధతి
కిలో బియ్యంలో లీటరు నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఆ నీళ్లను ప్లాస్టిక్ పాత్ర / బిందెలో నిల్వ ఉంచి పైన గుడ్డకప్పాలి. ఐదో రోజు 3 లీటర్ల పచ్చి పాలు కలపాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజులు పులియబెడితే పైన మీగడ తెట్టులా పొర కడుతుంది. దానిని తొలగించి చూస్తే.. ద్రావణం లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని ఆ వెంటనే వాడుకోవచ్చు.æ కిలో బెల్లం కలుపుకుంటే 15–20 రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఐఎంవో తయారీ..
పంటలకు మేలు చేసే పలు రకాల సూక్ష్మజీవులు వాతావరణంలో ఉంటాయి. వీటిని భూమిలోకి చేర్చి పంటలకు మేలు చేసేందుకు ఐఎంవో ఉపయోగపడుతుంది. ఒక చెక్కపెట్టెను తీసుకొని మూడొంతుల అన్నంతో నింపి మూతపెట్టాలి. అన్నం పొడిపొడిలాడుతూ ఉండాలి. లోపలికి గాలి చొరబడకుండా చెక్కపెట్టె చుట్టూ తెల్ల కాగితంతో చుట్టాలి. చెట్టు నీడ కింద గుంతను తవ్వి చెక్కపెట్టెను పూడ్చాలి. చెక్కపెట్టెలో అన్నం నింపిన భాగం భూమట్టానికి సమానంగానూ.. ఖాళీ ప్రదేశాన్ని భూమి మట్టం నుంచి పైకి ఉంచి గుంతలో పూడ్చాలి. చల్లటి వాతావరణం ఉండేందుకు బాగా చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. 4 రోజులకు చెక్కపెట్టెలోని అన్నంపైన బూజు వస్తుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు ఆశిస్తే బూజు తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని వెంటనే పంటలకు వేసుకోవచ్చు. నిల్వ ఉంచుకొని వాడుకోవాలంటే.. కిలో బెల్లం కలుపుకుంటే చాలు. అయితే నలుపు రంగు బూజు వస్తే.. అది పంటలకు పనికిరాదు. మళ్లీ తయారు చేసుకొనివేరే ప్రదేశంలో చెక్కపెట్టెను పూడ్చాలి.
వాడుకునే విధానం
ల్యాబ్, ఐఎంఓ రెంటినీ భూసారాన్ని పెంచుకోవడానికి ఎరువుగా వేసుకోవచ్చు. లేదా మొక్కలపై పిచికారీ చేయవచ్చు. డ్రిప్పు ద్వారానూ అందించవచ్చు. ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని 100 లీటర్ల నీరు పోసి కిలో ఐఎంవో లేదా కిలో ల్యాబ్‌ను కలపాలి. సిద్ధం చేసుకున్న పశువుల ఎరువులో ఈ ద్రావణాన్ని కలిపి పొలంలో చల్లుకోవాలి. లేదా లీటరుకు 2 మి. లీ. (ఇంత తక్కువ మోతాదులో కూడా చక్కగా పనిచేస్తుంది) చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసుకోవచ్చు. వీటిని 20 రోజుల దశ నుంచి ప్రతి 10 రోజులకోసారి భూమిలో వేసుకోవటం లేదా పిచికారీ చేయాలి. కినోవాలో అయితే పంటకాలంలో ఆరుసార్లు పిచికారీ చేయాలి.
ఆకుల ద్రావణాలు, పండ్ల రసాల తయారీ
కినోవా సాగులో పోషకాలను అందించేందుకు వివిధ రకాల పండ్లు, ఆకులతో చేసిన రసాలను వాడారు. అల్లం, వెల్లుల్లి, చేప, అరటి బోదె. ఆకులు, మాగిన పండ్లు, పొగాకు, మల్బరీ ఆకు, కంది కట్టెను కాల్చగా వచ్చిన బొగ్గు, కోడిగుడ్డు పెంకులు, వివిధ రకాల ఎముకలతో విడివిడిగా ద్రావణాలు తయారు చేస్తారు. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు ఇతర సూక్ష్మపోషకాలు ఈ ద్రావణాల్లో ఉంటాయి. 100 లీటర్ల నీటిలో ఈ ద్రావణాలన్నింటిని కలుపుకోవాలి. ఒక్కో ద్రావణాన్ని లీటరు నీటికి 2 నుంచి 3 మి. లీ. చొప్పున కలుపుకుంటే చాలు. ప్రతి పది రోజులకోసారి పంటలపై పిచికారీ చేసుకోవాలి. అన్ని రకాల పంటలపైనా వీటిని పిచికారీ చేసుకోవచ్చు. చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, వేపనూనె, చౌమంత్ర (వేప, జిల్లేడు, ఆముదం, సీతాఫలం తదితర 5 రకాల ఆకుల కషాయం)ను వాడుతున్నారు.
Comments