top of page

వంగ!

నేలలు: బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు. నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం మరియు వేసవి పంటకు 4-5 చదరపుమీ. మళ్ళను తయారు చేసుకోవాలి.

విత్తే సమయం(నారుకోసం) : వర్షాకాలపు పంటను జూన్ ‍ జులైలో, శీతాకాలపు పంటను అక్టోబర్ నవంబరులో, వేసవి కాలపు పంటను జనవరి రెండవ పక్షం వరకు నారు కోసం విత్తుకోవచ్చు.

విత్తనాలు: విత్తనం : ఎకరాకు సూటి రకాలకు 260గ్రా., సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాలి. విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున ధైరామ్ లేదా ఇండోఫిల్ యం 45 అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ను కూడా పట్టించి విత్తుకోవాలి.

నాటే దూరం : పొడవుగా, నిటారుగా పెరిగే రకాలకు (పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండు, భాగ్యమతి, శ్యామల) 60 x 60 సెం.మీ., గుబురుగా పెరిగే రకాలకు (పూసా క్రాంతి, అర్క కుసుమాకర్, గులాబి) 75 x 50 సెం.మీ. దూరం పాటించి నాటాలి.

నారుమడి పెంపకం: 6 అంగుళాలు ఎత్తు ఉండే 1 X 4 మీటర్ల సైజు గల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. విత్తిన తరువాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2 – 3 సార్లు నారుమడిని బాగా తడపాలి.

నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోప్యురాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. 30 – 35 రోజుల నారును నాటుకోవాలి. వర్షాకాలం నారును జూలై ఆగష్టులో చలికాలం నారును నవంబర్ డిసెంబరులో, వేసవికాలం నారును ఫిబ్రవరి-మార్చి మొదటివారంలో నాటవచ్చు.ఎకరాకు 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి.

బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోప్యురాన్ గుళిక మందులను నాటే ముందు వేసుకోవాలి.

రకాలు: తెలంగాణా ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్ ,శ్యామల రకాలు, రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారల వంగ(రాయదుర్గ) రకాలు అనుకూలం.

సంకరజాతి రకాలు: ఊదారంగు గుండ్రటి రకాలు : అర్కనవనీత్, పూసాహైబ్రిడ్ -6, మహికో హైబ్రిడ్ నెం. 2, నెం. 54, ఉత్కర్ష , మోహిని, అగోరా, మంజు, సంజు, మ్యూ – మ్యూ

ఊదారంగు గుత్తి రకాలు : మహికో – రవయ్య , మహికో హైబ్రిడ్ నెం. 3 ఊదారంగు పొడవు రకం : పూసా హైబ్రిడ్ – 5 పచ్చటి పొడవు రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 9, గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, బి.హెచ్ – 0028 1311, -1444 పచ్చటి గుండ్రటి రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 56, గ్రీన్ బంచ్ ఊదారంగు చారల రకాలు : కల్పతరు, మహికో హైబ్రిడ్ నెం. 11,16

ఎరువులు: ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్), 24 కిలోల పొటాష్ లనిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి.

40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా), 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ,60వ మరియు 75 రోజులకు పైపాటుగ‌ వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సివుంటుంది.

కలుపు నివారణ అంతరకృషి: విత్తిన లేదా నాటిన 24 నుండి 48 గంటలలో అలాక్లోర్ ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. నాటిన 25,30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.

నీటి యాజమాన్యం: నాటేముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7 – 10 రోజులకొకసారి, వేసవిలో 4 – 5 రోజులకొకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి.

సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1, 2 రోజుల ముందు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మరుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.

వంగలో సమగ్ర సస్యరక్షణ‌: పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 4 చొప్పున పెట్టాలి.

తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం క్రిందికి తుంచి నాశనం చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పునపంట పెరిగే దశలో విడుదల చేయాలి.

ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొప్పునవిడుదల చేయాలి. బి.టి. మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పూతదశలో పిచికారి చేయాలి. ఎకరాకు 200 కిలోల చొప్పునవేపపిండిని దుక్కిలో వేయాలి.

బాక్టీరియా ఎండుతెగులు వున్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ను ఎకరాకు 2 – 3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ను 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 – 15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంధ్రం దానిలో బాగా అభివృద్ధి చెందుతుంది. దీని వాడకం వలన భూమి నుండి ఆశించే ఎండు, కుళ్ళు తెగుళ్ళను నివారించవచ్చు.

రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోవ్యురాన్ గుళికలను వేసుకోవాలి. 2 మి.లీ. ఎండోసల్ఫాన్ లేదా 0.5 మి.లీ. సైపర్ మెత్రిన్ లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి కాయతొలుచు పురుగులను నివారించుకోవాలి. పంట పూత, కాయ దశలో 2,4 డి (10 మి.గ్రా. లీటరు నీటికి) లేదా నాఫ్తలిన్ అసిటికామ్లం 1 మి.లీ. 5 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే 15-20% అధికోత్పత్తి పొందవచ్చు.

2 views0 comments

Recent Posts

See All

Comentarios


bottom of page