top of page

Lemon / నిమ్మ!

మన రాష్ట్రంలో ఈ తోటలు 1.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 21.22 లక్షల టన్నుల పండ్ల దిగుబడి నిస్తున్నవి. దిగుబడి షుమారుగా ఎకరాకు 10 టన్నులు. చీనీ, నిమ్మ పండ్ల నుండి పెక్టిన్‌, సిట్రిక్‌ ఆమ్లం, నిమ్మనూనె, నిమ్మ ఎస్సెన్స్‌ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారుచేయవచ్చు.

వాతావరణం : 750 మి.మీ. వర్షపాతం మరియు నీటి ఆధారం కల్గి, గట్టి ఈదురు గాలులు లేని ప్రాంతాలు అనుకూలం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు సాగుచేయవచ్చు.

నేలలు : నీరు నిలువని లోతైన ఎర్ర గరప నేలలు శ్రేష్ఠం. తేలికపాటి నల్లభూములు కూడా అనుకూలం. ఏ కాలంలోనైనా నేలలోని నీటి మట్టం కనీసం 2 మీటర్ల క్రింద ఉండాలి. నేలలోని ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. బంక నేలలు, పల్లపు భూములు, చవుడు భూములు పనికిరావు. నీరు త్వరగా ఇంకిపోని, తక్కువ లోతుగల, రాతి పొరల నేలలు పనికిరావు. అధిక పాలు సున్నపురాళ్ళు ఉంటే, చెట్లు పల్లాకు తెగులుకు గురై త్వరగా క్షీణిస్తాయి.

రకాలు: చీనీ రకాలు: సాత్‌గుడి : దక్షిణ భారతదేశంలో పేరొంది, చెట్టుకి 1000-2000 పండ్లనిస్తుంది. బాగా తయారైన పండు, కొంచెం ఎరువుతో కూడిన పచ్చరంగు కలిగియుంటుంది. పండు బరువు 150-240 గ్రాములు, రసం 44-54 శాతం, పులుపు దనం 0.63-0.67 శాతం మరియు 100 గ్రాములకు 44-50 మి., గ్రాముల విటమిన్‌-సి కలిగియుంటుంది.

బటావియన్‌ (బత్తాయి) : ఈ రకాన్ని కోస్తా జిల్లాల్లో సాగుచేస్తారు. సాత్‌గుడి రకాన్ని పోలి ఉంటుంది. బత్తాయి పండ్లను దోమకాటు నుండి తప్పించటానికి గాను తాటాకు బుట్టలతో రక్షణ కల్పించటం వలన పండు, ఆకుపచ్చ, పసుపు గడులు ఉంటుంది. సాత్‌గుడితో పోలిస్తే నాణ్యత తక్కువ, మార్కెట్లో రేటు తక్కువగా ఉంటుంది.

మొసంబి : తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. పండుపై గరుకుగా నిలుపు చారలుంటాయి. పండు బరువు 170-200 గ్రాములు. పండు మధ్యస్తంగా ఉంటుంది. రసం తక్కువ. మార్కెట్లో రేటు తక్కువగా ఉంటుంది.

నిమ్మ రకాలు : నిమ్మ రకాల్లో కాగ్జి నిమ్మ శ్రేష్టమైనది. దీని ఒక్కొక్క చెట్టు, సంవత్సరంలో 3000-5000 కాయలనిస్తుంది. పండు బరువు 40-45 గ్రాములు. ‘బాలాజి’ నిమ్మ మరియు పెట్లూరు సెలక్షన్‌-1 రకాలు గజ్జి తెగులును తట్టుకొంటాయి. 42-52 శాతం రసం, 6.8-7.0 శాతం పులుపు దనం మరియు 100 గ్రాముల రసానికి 25-27 మి.గ్రా. విటమిన్‌-సి కలిగి ఉంటుంది.

మొక్కల ఎంపిక : రంగపూర్‌ నిమ్మపై కట్టిన వైరస్‌ తెగుళ్ళులేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా గజ నిమ్మ/రంగపూర్‌ నిమ్మపై కట్టిన అంట్లను ఎన్నుకోవాలి.

అంట్ల ఎంపికలో మెళకువలు : వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తరువాత 6-10 నెలల వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్‌, గ్రీనింగ్‌, ట్రిస్టిజా మొదలైన వెర్రితెగుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణుపుల మధ్యదూరం దగ్గరగా ఉండి, ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి.

నాటటం : చీనీ, నిమ్మ మొక్కలను 6X6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8X8 మీ. దూరంలోనూ నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1X1X1 మీటరు సైజు గుంతలను త్రవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలోనూ పై పొర మట్టితో పాటు 40 కిలోల పశువుల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్‌ఫాస్ఫేటు, 100 గ్రాముల పది శాతం లిండేను పొడివేసి కలిపి నింపాలి.

అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు అంట్లు నాటేటపుడు అంటు భాగం నేల మట్టం నుంచి 15 సెం.మీ. ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళల్లో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి. నీటి యాజమాన్యం : చిన్న మొక్కలకు ఎండాకాలంలో తరుచుగా నీరు కట్టాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్ల వయస్సు, దిగుబడులపైన ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు కట్టాలి. నీటిఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో ఎండాకులు, వరి పొట్టు, లేదా వేరుశనగ పొట్టు 8 సెం.మీ. మందంలో వేసి తేమ ఆవిరై పోకుండా కాపాడుకోవచ్చు. ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి. డబుల్‌ రింగు పద్ధతిలో నీరు కట్టడం మంచిది. పిల్లపాదిని 2-4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి చెట్టు మొదలకు నీరు తాకకుండా చూడాలి. షుమారుగా 6 నుండి 8 ఉదజని సూచిక ఉన్న నేలల్లో 0.75 డెసీసైమన్‌/మీ. కన్నా తక్కువ విద్యుత్‌ ప్రవాహం గల సాగు నీటిని వాడి తోటలను లాభదాయకంగా పెంచవచ్చు. డ్రిప్పు పద్ధతిలో నీరు కట్టడం వలన నీటి ఆదాయమేగాక మొక్కల పెరుగుదల, కాయ నాణ్యత కూడా పెరుగుతాయి మరియు కలుపు మొక్కలు తగ్గుతాయి. డ్రిప్‌ పద్ధతిలో నీరు కట్టేటప్పుడు అన్ని చెట్లకు సమృద్ధిగా నీరు అందుతుంది. దీనిని జాగ్రత్తగా గమనించాలి.

కొమ్మల కత్తిరింపు : వేరు మూలాన్నుండి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకూ ప్రక్క కొమ్మలు పెరగకుండా తీసివేయాలి. చెట్టులో నీడన ఉన్న అనవసరమైన కొమ్మలు, ఎండు పుల్లలు కత్తిరించాలి. నిటారుగా పెరిగే నీటి కొమ్మలు కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మ చివర్లకు తెగుళ్ళు ఆశించకుండా బోర్డోపేస్టును పూయాలి. వేరు మూలం నుండి వచ్చే కొమ్మలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఒక మొక్క వదలి మరొక మొక్కను కత్తిరించినప్పుడు, కత్తెర్లను ఆల్కహాలు లేదా స్పిరిట్‌లో అద్ది గాని లేదా తుడిచిగాని కత్తిరించవలెను. ఇందువల్ల ఒక మొక్కలోని వైరస్‌ తెగుళ్ళు మరొక మొక్కకు వ్యాప్తి చెందవు.

కలుపు నివారణ, అంతరకృషి/అంతరపంటలు : కాపురాక ముందు రెండు, మూడు సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు, బంతి, దోస, ఉల్లి, పుచ్చ వేయవచ్చు. మిరప, టొమోటో, వంగ, పొగాకు పైర్లను వేయకూడదు. ఈ పైర్లను వేయటం వలన నులి పురుగుల బెడద ఎక్కువవుతుంది. వర్షాకాలంలో జనుము, అలసంద, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదిలో మరియు భూమిలో వేసి కలియ దున్నాలి. పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి. పాదులు త్రవ్వేటపుడు, ఎరువులు వేసేటపుడు వేర్లు ఎక్కువ తెగకుండా తేలికపాటి సేద్యం చేయాలి. మామిడిలో తెలిపిన కలుపు నివారణ చర్యల ద్వారా చీనీ, నిమ్మలలో కలుపును నివారించవచ్చు.

పూత, పిందె రాలుడును అరికట్టటం : పిందె, కాయ రాలుట రెండు దశలుగా గమనించవచ్చు. చెట్ల పాదుల్లోని ఒడుదుడుకులు, హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని చెట్లలో జరిగే రసాయనిక మార్పుల వలన పిందె, కాయ రాలటం జరుగుతుంది. చెట్లు పూత, పిందెలతో ఉన్నపుడు త్రవ్వడం, దున్నడం చేయరాదు. ఎండలు ముదిరే కొద్దీ చెట్లకు క్రమం తప్పక నీరు కట్టాలి లేదా 10 పి.పి.యం. 2,4-డి మందు(అంటే 1గ్రాము 100 లీటర్ల నీటిలో) కలిపి పూత సమయంలో ఒక మారు, పిందె గోళి గుండు సైజులో ఉన్నపుడు ఇంకొక మారు పిచికారి చేయాలి. సస్యరక్షణ: పురుగులు: ఆకుముడత : నర్సరీ దశ నుంచి పెద్ద చెట్ల దశ వరకు, వర్షాకాలం మరియు శీతాకాలంలో లేత చిగుర్లపై ఎక్కువగా ఆశిస్తుంది. ఆశించిన ఆకుపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి, ఆకు ముడతలు పడి, గజ్జి తెగులు ఎక్కువగా ఆశించి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి లేత చిగుర్ల దశలోనే 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారి చేయాలి. సాధారణంగా చీనీ, నిమ్మలపై ఆకుముడత పురుగు జూన్‌-జులై, సెప్టెంబర్‌-అక్టోబర్‌ మరియు డిశంబర్‌-జనవరి నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. కావున దీని నివారణకు పురుగు మందులను పురుగు ఆశించే నెలలో పిచికారి చేసుకోవాలి.