Tomato/టమాట!
నేలలు: బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయవచ్చు.
శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగుచేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు.
పొలాన్ని3 – 4 సార్లు దున్ని చదును చేయాలి. వర్షాకాలం పంటకు 60 సెం.మీ. దూరంలో బోదెలు చేసుకోవాలి. ఇతర ఋతువుల్లో 4 X 5 చ.మీ.గల మళ్ళను తయారుచేసుకోవాలి.
విత్తన శుద్ధి: ఎకరాకు సూటి రకాలకు 200 గ్రా. ధైరమ్ తో లేదా 3గ్రా. మెటలాక్సిల్ తో విత్తనశుద్ధి చేయాలి. 2 గంటల తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మా కల్చర్ తోను విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో రసం పీల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేయాలి.
నాటటం : వర్షాకాలంలో 60 x 40 సెం.మీ., శీతాకాలంలో 60 x 60 సెం.మీ., వేసవిలో 45 x 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి
నాటే సమయం: వర్షాకాలంలో జూన్- జులైలో, శీతాకాలంలో అక్టోబర్ -నవంబర్ లో, వేసవిలో జనవరి -ఫిబ్రవరిలో నాటుకోవచ్చు.
నారుపోయటం : ఎకరం పొలంలో నాటడానికి 1 X 4 చ.మీ. విస్తీర్ణం గల, 6″ ఎత్తైన 8 నుండి 10 నారుమళ్ళు తయారు చేయాలి. నారుమడిలో మొక్కలు ధృడ పడటానికి గింజ విత్తిన 20 – 30 రోజుల మధ్య, రోజు విడిచి రోజు నీరు కట్టాలి. 25 – 30 రోజుల వయసు ఉండి 3 – 4 ఆకులు గల మొక్కల్ని నాటు కోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు. తప్పనిసరి పరిస్థితులలో ముదిరిన నారు నాటుకోవాల్సి వస్తే తలలు త్రుంచి నాటుకోవాలి.
రకాలు: వర్షాధార పంటకు : తొలకరి ఖరీఫ్ లో వేసుకోడానికి అర్క మేఘాలి, పూసా ఎర్లీడ్వార్ఫ్, అలాగే ఖరీఫ్ లో ఆలస్యంగా వేసుకోవడానికి పూసారూబీ, అర్కవికాస్ రకాలు అనుకూలం.
శీతాకాలానికి : పూసారూబీ, పూసా ఎర్లీడ్వార్ఫ్, అర్కవికాస్, అర్కసౌరభ్. వేసవి పంటకు : మారుతమ్, పికెయమ్ -1, అర్కవికాస్, అర్కసౌరభ్.
సంకరజాతి రకాలు : వైశాలి, రూపాలి, రష్మి, నవీన్, మంగళ, అనినాష్ -2,బిఎస్ ఎస్ -20, రజనీ, అన్నపూర్ణ, ఎమ్.టి.హెచ్ 1,2,6
ప్రాసెసింగ్ కి అనుకూలమైన రకాలు : హైబ్రిడ్ రకాలు సలాడ్ కు మరియు ప్రాసెసింగ్ కు అనుకూలం. నిల్వకి :(సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 8 – 10 రోజుల వరకు, శీతల గిడ్డంగుల్లో 30 రోజుల వరకు నిల్వ ఉండే రకాలు) అర్కవికాస్, అర్కసౌరభ్ మరియు ఇతర హైబ్రిడ్ రకాలు.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్) మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి.
48 – 60 కిలోల నత్రజనిని 3 సమపాళ్ళుగా చేసి, నాటిన 30 – 45 మరియు 60 వ రోజున పై పాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారి చేస్తే 15 – 20% దిగుబడి పెరుగుతుంది.
నాటే ముందు ఎకరాకు 8 – 12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా వుంటాయి. ఎకరానికి 10 కిలోల చొప్పున జింకు సల్ఫేట్ వేసినట్లయితే జింకు లోపం రాకుండా వుంటుంది.
నాటిన తర్వాత 30-45 రోజులకు లీ. నీటికి 5 గ్రా. జింకుసల్ఫేట్ ను కలిపి పిచికారి చేసినట్లయితే 20% దిగుబడి పెరుగుతుంది.