Pomgrante/ దానిమ్మ!
వాణిజ్యపరంగా పండించే పళ్ళలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషద విలువలతో పాటు, సేద తేర్చే రసాన్ని దానిమ్మ పళ్ళనుండి పొందవచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాల ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగుచేయవచ్చు. మన రాష్ట్రంలో దానిమ్మ అనంతపురం మరియు మహబూబ్‌నగర్ జిల్లాల్లో 8750 ఎకరాలలో సాగుచేయబడి, 59వేల 500 టన్నుల దిగుబడినిస్తున్నది. వాతావరణం : పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లను పండించవచ్చు. కోస్తా తీర ప్రాంతాలు అనుకూలం కాదు. ఈ ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉండి, చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. నేలలు : దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికివస్తాయి. సున్నపుశాతం, క్షారత కొద్ది అధికంగా ఉన్న భూముల్లో కూడా దానిమ్మను సాగుచేయవచ్చు. లోతైన సారవంతమైన మురుగు నీరు పోయే వసతి గల నేలల్లో, ఉదజని సూచిక 7.0 నుండి 8.5 వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మను సాగుచేయవచ్చు. 60 సెం.మీ. లోతున్న భూములు అనుకూలం. చీనీ, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకు అనుకూలం కాని భూములలో కూడా దానిమ్మను లాభసాటిగా సాగుచేయవచ్చు. రకాలు: రకం ముఖ్యలక్షణాలు గణేష్ మన రాష్ట్రంలో ఈ రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడి నిచ్చే రకం. కాయ బరువు షుమారు 250 గ్రాములు ఉంటుంది. చర్మపు రంగు ఆకర్షణీయమైన పింక్ రంగుతో కూడిన పసుపు వర్ణం కలిగి ఉండి, చక్కెర శాతం 17 దాకా ఉండి, శీతాకాలంలో పింక్ రంగు, వేసవిలో తెలుపు రంగును కలిగి ఉంటుంది. విత్తనాలు మృదువుగా ఉంటాయి. గణేష్- 137 కాయలు 250-280గ్రా. ఇది గణేష్ రకం నుంచి అభివృద్ధిపరచిన రకం. ఇంచు మించు గణేష్ రకాన్ని పోలి ఉంటుంది. గణేష్ కంటే దిగుబది అధికంగా ఇస్తుంది చక్కెర శాతం 15.5 ఉండి విత్తనాలు మృదువుగా ఉంటాయి. మృదుల కాయలు 230-270 గ్రా. సగటు బరువు కలిగి ఉండి, ముదురు పింకు రంగు గింజలు కలిగి ఉంటాయి. చర్మం మందం కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆంత్రాక్నోస్ మచ్చ రోగాన్ని గణేష్ కంటే బాగా తట్టుకొంటుంది. చక్కెర శాతం 18 వరకు ఉంటుంది. బగువ కాయలు 250-300గ్రా. సగటు బరువు కలిగి ఉండి చర్మం, గింజలు ముదురు పింక్ రంగులో ఉంటాయి. మృదువైన గింజలు కలిగి ఉండి ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి.
పై రకాలు ఒక సంవత్సరం వయస్సు నుంచి పూత పూసి పిందె ఏర్పడతాయి. కాని 18 నెలల వయసు వరకు పూత, పిందెలను చెట్టు నుంచి తెంపి, తరువాత కాయలు నిలిపి పంట తీయవచ్చు.
ప్రవర్థనం : దానిమ్మను కొమ్మల ద్వారా నేల అంట్లు లేదా గాలి అంట్ల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన చెట్టు నుంచి కొమ్మలను కత్తిరించాలి. ఒక సంవత్సరం వయసున్న ముదురు కొమ్మలను 9-12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్క మొదలు నుంచి వచ్చే కొమ్మలను కత్తిరింపులు చేసి నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. ఆరు నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మలను కత్తిరింపు కోసం ఎన్నుకోరాదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటుటకు అనువుగా వుంటాయి. వర్షాకాల ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్థనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశముంటుంది. గాలి అంట్లు 25-30 రోజులలో వేర్లు తొడిగి 3 నెలలకు నాటుటకు అనువుగా వుంటాయి.
నాటటం : రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 4.5X3 మీ నుంచి 4X4 మీ. దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతితో నీరు పెట్టటానికి అవకాశముంటే జూన్ నుండి మార్చి వరకు నాటుకోవచ్చు. 60X60X60 సెం.మీ. గుంతలు తీసి, నెలరోజుల గుంతలను సూర్యరశ్మికి ఆరనివ్వాలి. తర్వాత ప్రతి గుంతకు 20 కేజీలు పశువుల ఎరువు, 2 కేజీలు వానపాముల ఎరువు, 3 కేజీలు వేపచెక్క, 25గ్రాములు ట్రైకోడెర్మాపొడి, 15 గ్రాములు ఫాస్పోబాక్టీరియా మరియు 15 గ్రాములు అజిటోబాక్టరును మట్టితో కలిపి గుంతలు నింపాలి.
ఎరువులు : ఒక్కొక్క చెట్టుకు మొదటి సంవత్సరపు 4 నెలల తర్వాత 125గ్రా. వేపపిండి +5 కిలోల చివికిన పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువు మరియు 11 నెలల తరువాత 750 గ్రా. వేపపిండి+ 10 కిలోల చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రా. నత్రజని, 250గ్రా. భాస్వరం,250గ్రా. పొటాష్ దఫాలుగా మొదటి తడికి ముందు తరువాత కాయ ఎదిగే దశల్లో వేయాలి.
కలుపు నివారణ : వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేలగుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రటాప్ ఎకరాకు 800గ్రా. 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తర్వాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లైసిల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ. మందును కలిపి దానితో పాటు20గ్రా. అమ్మోనియం సల్ఫేట్ గాని, 10గ్రా. యూరియా గాని కలిపి 20-25 రోజులు కలుపుపై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయస్సు పండ్ల మొక్కల మీద పడకుండా జాగ్రత్త వహించాలి. దానిమ్మ తోపాటు చీనీ, నిమ్మ, జామ, సపోట, రేగు, సీతాఫలం తోటల్లో కూడా ఇదే విధంగా కలుపు నివారణ చేసుకోవచ్చు.
నీటి యాజమాన్యం : నేలలో నీటి శాతం ఒకేవిధంగా ఉండాలి, లేకపోతే పండ్లు పగులుతాయి. మార్చి నుండి జూలై వరకు భూమిలో తేమ సమంగా వుండేలా నీటి తడులు ఇవ్వాలి. దానిమ్మకు 0.5 మిల్లీ మోస్/సెం.మీ. విద్యుత్ వాహకత గల ఉప్పునీరు కూడా ఉపయోగించవచ్చు. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్టు పెరుగుదల, కాయలసంఖ్య మరియు బరువు 35 శాతం వరకు పెంచవచ్చు. ఫర్టిగేషన్ (నీరు + రసాయనిక ఎరువులు) పద్ధతిలో కాయ నాణ్యతపెరుగుతుంది. చెట్టుపై పూత, కాయలు లేని సమయంలో నీటి తడులు తగ్గించాలి. వేరుశనగ పొట్టు లేదా వరిపొట్టుతో 8 సెం.మీ. మందంతో చెట్టు పాదులందు మల్చింగ్ చేయాలి.
కత్తిరింపులు : ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలినవి కత్తిరించాలి. 2-3 సంవత్సరాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మలను తగు రీతిగా పెంచి సరైన ఆకారం తీసుకు రావాలి. నేలకు ప్రాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మలను కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతి నిచ్చే సమయంలో చివరి కొమ్మలను 10-15 సెం.మీ. పొడవు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగురు తీసివేసినచో బలమైన కొమ్మలపై పిందెలు ఏర్పడి కాయసైజు పెరుగుతుంది. చెట్టుకు 60-80 కాయలు ఉంచి మిగతావి తీసివేయాలి.
పూతకాలం మరియు నియంత్రణ : దానిమ్మకు సంవత్సరం పొడవునా పూతపూసే లక్షణం ఉన్నప్పటికి, 3 సీజన్‌లలో, జనవరి-ఫిబ్రవరి, జూన్-జూలై, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఎక్కువగా పూస్తుంది. ఏ సీజన్‌లో పంట తీసుకోవాలో, ఏ సమయంలో అధిక రేటు లభిస్తుందో, నీటి సదుపాయం, భూమి లక్షణాలు, పురుగులు మరియు తెగుళ్ళ వలన కలిగే నష్టమ మరియు వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. బ్యాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. గనుక సెప్టెంబర్ రెండవవారం కాని అక్టోబర్ మొదటి వారంలోకాని వచ్చే పూతను నిలపడం మంచిది. నీటి తడులు మానివేయడం వలన చెట్లు ఆకురాల్చి నిద్రావస్థలోకి వెళతాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి, ఎరువువేసి, తడులివ్వడం వలన చెట్లన్నీ ఒకేసారి పుష్పిస్తాయి.
సస్యరక్షణ: కాయతొలుచు పురుగు : ఈ పురుగు దానిమ్మ పండ్లకు చాలా నష్టం కలుగజేస్తుంది. ఒక్కొసారి ఈ నష్టం 50% వరకు కూడా ఉంటుంది. జామ, ఉసిరి, నేరేడు, సపోటా, చింతపండును కూడా ఆశిస్తుంది. సీతాకోకచిలుకలు ఒక్కొక్క గుడ్డును పూవు లేదా పిందెలపై పెడతాయి. లార్వాలు కాయలోపలికి తొలుచుకొనిపోయి, గుజ్జును, గింజలను తింటాయి. కాయకు చేసిన రంధ్రం, విసర్జించిన రెట్టతో కప్పి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా, బూజు వ్యాపించి కాయ కుళ్ళిరాలిపోతుంది. చెట్లు పూత, మొగ్గడశలో ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ 2 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేసి 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3గ్రాముల లేదా డైక్లోర్‌వాస్ 2మి.లీ./లీటరు నీటికి కలిపి మరోసారి పిచికారి చేసి ఈ పురుగును నివారించవచ్చు.
బెరడు తినే పురుగులు : సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా, నిర్లక్ష్యంగా వదిలివేసిన తోటలను ఎక్కువగా ఆశిస్తాయి. బెరడు తుట్టెలను తొలగిస్తే రంధ్రాలు కనబడుతాయి. రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోలు లేదా కార్బన్-డై-సల్ఫైడ్‌లో ముంచిన దూదితో నింపి బురదతో మూసి అరికట్టవచ్చు.
తామర పురుగులు : ఈ పురుగులు ఆకులను, ల