top of page

Drip / బిందు సేద్యం!

వేర్లకే తేమ ఇవ్వటం మేలు!

Sakshi | Updated: March 25, 2015 23:25 (IST)

డ్రిప్ పద్ధతి

మొక్కకు నీటి చుక్కలు ఇచ్చే కన్నా. నేలలో పాతిన కుండ ద్వారా.. నేరుగా మొక్కల వేరు వ్యవస్థకే.. అత్యంత పొదుపుగా నీటి తేమనందించే అధునాతన డ్రిప్ వ్యవస్థ ‘స్వర్’ సాధారణ డ్రిప్‌కు ఖర్చయ్యే నీటిలో 10% చాలు.. కరెంటుతో పనిలేదు.. కలుపు రాదు.. వినూత్న ఆవిష్కరణకు {ఫెంచ్ ప్రభుత్వ పురస్కారం జలం.. ప్రాణావసరం! తరుముకొస్తున్న కరువు కాలంలో.. ప్రతి నీటి బొట్టూ ప్రాణప్రదమే. ఒక్క చుక్కనూ సృష్టించలేం.. పది నీటి బొట్లు వాడే చోట ఒక్కదానితో ప్రాణం నిలబెట్టుకోవాలి- అది మనిషిదైనా, మొక్కదైనా! నీటి పారుదలకు స్వస్తి చెప్పి.. చుక్కలు చుక్కలుగా నేలను తడిపే బిందు సేద్యాన్ని చేపట్టాం. ఆహా ఓహో అనుకుంటున్నాం.. అయితే, ఈ బిందు సేద్యానికీ చాలినంత నీరు లేకపోతే..? అన్నదాతల రేపటి ఆశలకు ప్రతి రూపాలైన పండ్ల మొక్కలను మండుటెండల నుంచి కాపాడుకునేదెలా..? నీరూ సరిగ్గా లేక.. కరెంటూ అంతకన్నా అందని స్థితిలో రైతుకు దిక్కేమిటి? ఇదే ప్రశ్న సామాజిక శాస్త్రవేత్త కే ఎస్ గోపాల్ మదిని ఏళ్ల తరబడి తొలిచేసింది. ఎడతెగని మథనం తర్వాత.. ఆయన మదిలో ఒక అద్భుత ఆవిష్కరణ మెరిసింది! బిందు సేద్యానికయ్యే నీటి ఖర్చులో 10% తోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకునే భేషైన ఉపాయం తట్టింది. కరెంటూ అక్కర్లేదు. కలుపు బెడదా లేదు. ఈ వినూత్న ఆలోచనను రైతుల పొలాల్లో మూడేళ్లుగా ఆచరణలో పెట్టి.. మరింత సమగ్రంగా తీర్చిదిద్దారు. దీని పేరు ‘సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్’(స్వర్). హైదరాబాద్ కేంద్రంగా గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ కన్‌సర్న్స్(సీడబ్ల్యూసీ)కు ఆయన 2 దశాబ్దాలుగా సారధిగా ఉన్నారు. మేనేజ్‌మెంట్ టీచింగ్‌లో అనుభవం గడించిన ఆయన గతంలో ముంబై ‘టిస్’లోను, హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్‌లోనూ సేవలందించారు. ఉపాధి హామీ పథకంపై పనిచేస్తున్న దశలో ‘స్వర్’ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. గత నెలలో పారిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్‌పోజిషన్‌లో ‘స్వర్’కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఛాంపియన్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ‘స్వర్’ను మరింత మెరుగుపరచి అంతర్జాతీయ సమాజానికి అందుబాటులోకి తేవడానికి ఈ పురస్కారం అవకాశం కల్పిస్తుందని గోపాల్ ఆశిస్తున్నారు. నీటి వనరులు బొత్తాగా కొడిగడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరటి తోటలు, పండ్ల తోటలతోపాటు అడవుల పెంపకానికీ ఎంతగానో ఉపకరించే ‘స్వర్’ గురించి వివరంగా గోపాల్ అందించిన వివరాల మేరకు.. మీ కోసం! మండువేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగినప్పుడు.. ఎటువంటి ఆచ్ఛాదన లేని నేల ఉష్ణోగ్రత 60-65 డిగ్రీల వరకు ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు తమ భూముల్లో నాటుకున్న పండ్లమొక్కలు, బంజరు భూముల్లో నాటిన అడవి జాతి మొక్కలకు పుష్కలంగా నీరందించడం కరువు ప్రాంతాల్లో కనాకష్టమే. డ్రిప్ ఏర్పాటు చేయడానికి అక్కడ విద్యుత్, బోరు అందుబాటులో లేకపోవచ్చు. వాటిని ఏర్పాటు చేసుకునే స్థోమత రైతుకు ఉండకపోవచ్చు. బోరు, డ్రిప్ సదుపాయాలున్నప్పటికీ.. డ్రిప్ పనిచేయడానికి సరిపోయేంత నీరుండకపోవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కలను బతికించడమే కాదు.. మంచి దిగుబడినిచ్చేంత ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా ‘స్వర్’ దోహదపడుతుంది. నేరుగా వేర్ల దగ్గరకే నీటి తేమ.. డ్రిప్ లేటరల్ పైపులు జారవిడిచే నీటి చుక్కలు నేలపైన పడి.. నిట్ట నిలువుగా మట్టిని తడుపుతుంటాయి. ఇలా ఖర్చయ్యే నీటిలో కొంత భాగం ఆవిరైపోగా.. మిగిలిన కొంతభాగం మాత్రమే భూమిలోపల ఉన్న మొక్కల వేళ్లకు అందుతుంది. కానీ.. అధునాతన డ్రిప్ అయిన ‘స్వర్’ భూమి లోపలే నీటిని వదులుతూ.. నేరుగా మొక్కల వేర్లకు తగుమాత్రంగా నీటి తేమను అందిస్తుంది. వేర్లకు చేరక ముందే నీరు ఆవిరైపోవటం ఉండదు. ‘వేర్లకు కావాల్సింది నీరు కాదు.. మట్టి రేణువుల మధ్యలో ప్రాణవాయువుతో కూడిన నీటి తేమ మాత్రమే. తేమ ఎంత దూరం ఉంటే వేరు అంత దూరం విస్తరిస్తుంది. ‘స్వర్’ డ్రిప్ ఏర్పాటు చేసిన చోట భూమి లోపల 1.2 మీటర్ల దూరం వరకు తేమ విస్తరిస్తుంది. వేళ్లు ఆరోగ్యంగా, బలంగా, ఎక్కువ దూరం విస్తరించేందుకు తద్వారా అవకాశం కలుగుతున్నది. వేరు వ్యవస్థ బలంగా, విస్తారంగా పెరిగినప్పుడు మొక్క కూడా బలంగా ఎదుగుతుంది. కరువు కాలంలో కూడా ఐదేళ్ల లోపు పండ్ల తోటలను, మొక్కలను రక్షించుకోవడంతోపాటు చక్కని ఫలసాయం పొందడానికి అవసరమైన తేమను ‘స్వర్’ నిరంతరం అందిస్తుంది. డ్రిప్‌కు ఖర్చయ్యే నీటిలో కేవలం 10% నీటితోనే ‘స్వర్’ ఈ పని పూర్తిచేస్తుందని గోపాల్ తెలిపారు. డ్రిప్ మాదిరిగా స్వర్ వ్యవస్థలో మొక్కలకు రోజూ నీరివ్వాల్సిన పని ఉండదు.

ఏడాదిలో 100-150 సార్లు నీరిస్తే చాలు

సాధారణ డ్రిప్‌తో మొక్కలకు రోజూ నీరిస్తుంటారు. స్వర్ ద్వారా ఏడాదికి 100-150 సార్లు నీరిస్తే చాలని గోపాల్ అన్నారు. మొక్కలను, నేలను, వాతావరణాన్ని బట్టి నీరు అవసరమవుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి నీటిని వదిలిన కొద్ది నిమిషాల్లోనే ప్లాస్టిక్ బాటిల్, కుండ నిండిపోతాయి. బాటిల్ నిండగానే ట్యాంకు నుంచి నీరివ్వడం ఆపేయొచ్చు. భూమిలోపల తేమ 12 రోజుల వరకు ఉంటున్నట్లు గమనించామని గోపాల్ అన్నారు. మొక్కను కేవలం బతికించడం కోసమైతే 10 రోజులకోసారి నీరు ఇచ్చినా చాలని, ఆరోగ్యంగా పెంచడం కోసం ఎక్కువసార్లు నీరివ్వాలి అన్నారాయన.

3 రాష్ట్రాల్లో ప్రయోగాలు..

స్వర్ డ్రిప్ వ్యవస్థను అనంతపురం జిల్లాలో 8 మంది రైతులు 800 పండ్ల మొక్కలకు గత రెండేళ్లుగా వాడుతూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్గొండజిల్లాలో 280 మొక్కలు, రంగారెడ్డి జిల్లాలో 400 మొక్కలకు వాడుతున్నారు. 9 నెలల క్రితం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో , మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో కొన్ని పండ్లు, అడవి మొక్కలకు స్వర్ డ్రిప్‌ను ఏర్పాటు చేశారు. రైతులు ప్రత్యేకంగా తయారు చేసుకునే సంజీవని సేంద్రియ ఎరువు(పూర్తి వివరాలకు 18-12-2014 నాటి ‘సాగుబడి’ పేజీలో ‘సేద్య సంజీవని’ కథనం చూడండి) వేసిన తర్వాత, స్వర్ డ్రిప్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని గోపాల్ అన్నారు. ఈ ఎండాకాలంలో అన్నిచోట్లా పూర్తిస్థాయి గణాంకాలను నమోదు చేస్తున్నామన్నారు. రైతుల పొలాల్లోనే కాదు, అటవీ భూముల్లో, హైవేల వెంబడి నాటే అటవీ మొక్కలను తక్కువ నీటితోనే పెంచుకోవడానికి ‘స్వర్’ సమర్థవంతంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ‘స్వర్’ డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసేదిలా.. మొక్క నాటిన తర్వాత.. పాదుకు అడుగున్నర దూరంలో.. భూమి లోపల అడుగున్నర లోతులో మట్టి కుండను అమర్చి, దానిపైన ప్లాస్టిక్ బాటిల్‌ను ఉంచాలి. బాటిల్ నేలపైకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బాటిల్ పై భాగాన్ని లేటరల్ పైపునకు అనుసంధానం చేసి.. ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా అవసరమైనప్పుడల్లా నీటిని నింపుతూ ఉండాలి.

రెండున్నర లీటర్ల నీరు పట్టే మట్టి కుండను ఉంచి.. దానిపైన 5 లీటర్ల ప్లాస్టిక్ బాటిల్‌ను అమర్చాలి. బాటిల్‌కు అడుగున ఉన్న చిన్న బెజ్జంలో నుంచి నీరు కుండలోకి నెమ్మదిగా దిగుతుంటుంది. కుండకు సగానికి కొంచెం కిందగా బెజ్జం పెట్టి.. ఆ బెజ్జంలో నుంచి నీటి చుక్కలు బయటకు పోయేందుకు 3 అంగుళాల పొడవైన సన్న ట్యూబ్‌ను కుండ బయటకు పెట్టాలి. ఈ ట్యూబ్‌లోకి మట్టి చేరి మూసుకుపోకుండా ఉండేందుకు.. గుప్పెడు ఇసుకను షేడ్‌నెట్ ముక్కతో చుట్టి, తాడుతో కట్టాలి. కుండ ద్వారా నీరు మొక్క వేళ్ల దగ్గర మట్టిని తడుపుతూ ఉంటుంది. సన్న ట్యూబ్ పై వరకు నీరున్నంత సేపు నీటి చుక్కలు బయటకు వెళుతుంటాయి. కుండలో నీటిమట్టం తగ్గిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు కుండ చుట్టూ ఉన్న మట్టి ద్వారా తేమ వేళ్లకు అందుతూ ఉంటుంది.

పదేళ్ల వరకు ఢోకా ఉండదు! ‘స్వర్’ పద్ధతిలో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొక్కకు రూ. 300 నుంచి రూ. 350 వరకు ఖర్చవుతుంది. అయితే, మూడేళ్లకోసారి కొత్త కుండను ఏర్పాటు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మామిడి తోటలకు ప్రభుత్వం నీరు పోయడానికి మూడేళ్లకు ఎకరానికి రూ. 1,15, 000 ఖర్చు చేస్తోంది. కానీ, కేవలం రూ. 37 వేలతో ‘స్వర్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే పదేళ్ల వరకు ఢోకా ఉండదు. బంజరు భూముల్లో నాటే అటవీ మొక్కలకూ ఇది బాగా నప్పుతుంది.

3, 4 రోజులకోసారి నీళ్లిస్తున్నాం.. ఎకరంన్నరలో 170 మామిడి, సపోట, జామ తదితర పంట మొక్కలు రెండేళ్ల క్రితం నాటాను. ఏడాది క్రితం స్వర్ డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు 3-4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నాను. మొక్కలు బాగా పెరుగుతున్నాయి. జామ, సపోట కాయలు కాస్తున్నాయి. మొదట్లో మా కుంటలో నుంచి పెడల్ పంపుతో నీటిని ట్యాంకులోకి తోడేవాడిని. ఇప్పుడు మా అన్న పొలంలో బోరు నుంచి నీటిని తీసుకుంటున్నా. బోరున్న వాళ్లూ ఈ డ్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది.

1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page