top of page

ఒకే మోటారుతో రెండు బోర్ల నుంచి నీరు!

తన ఆవిష్కరణ లోగుట్టును వెల్లడించిన రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డి

  1. హెచ్‌.డి.పి. పైపుతో ఇక ఎవరైనా అనుసంధానించుకోవచ్చు!

  2. ఖర్చు అంతా కలిపి రూ. 10 వేల లోపే

దగ్గర్లో ఉన్న రెండు బోరు బావుల నుంచి ఒకే మోటారుతో నీటిని తోడుకునే పరిజ్ఞానాన్ని కనుగొన్న రైతు శాస్త్రవేత్త పందిరి పుల్లారెడ్డి అద్భుత ఆవిష్కరణ గురించి ‘పల్లెసృజన’ సౌజన్యంతో రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా తెలుగు రైతు లోకానికి తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేస్తూ సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. కోరిన రైతుల ఊళ్లకు పుల్లారెడ్డి స్వయంగా వెళ్లి రెండు బోర్లను అనుసంధానం చేసి చూపుతూ వచ్చారు. అయితే, తెలంగాణలో భూగర్భ నీటి మట్టం పెరిగి, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఇటీవల చాలా మంది రైతులు ఈ పద్ధతి గురించి అదేపనిగా ఫోన్లు చేస్తుండడంతో పుల్లారెడ్డి ఆలోచనలో పడ్డారు. అన్ని ఊళ్లకూ తానే స్వయంగా వెళ్లడం సాధ్యం కాని పని. కాబట్టి, రెండు బోర్లను అనుసంధానం చేసే పద్ధతిలో గుట్టుమట్లను రైతు లోకానికి విడమరచి చెబితే.. ఎవరికి వారే ఆ పనిని త్వరలోనే అమలు చేసుకోగలుగుతారని ఆయన భావించడం అభినందనీయం. తనను కన్న వారి పేరిట ‘వెంకట శేషాద్రి వాటర్‌ పంపింగ్‌ స్కీం’ను రైతాంగానికి అంకితం ఇస్తున్నానని పుల్లారెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. తన పొలంలోని రెండు బోర్లు ఆగి, ఆగి నీరు పోస్తుండడం.. రెండో మోటారుకు విద్యుత్‌ కనెక్షన్‌ పొందే అవకాశం లేకపోవడంతో వేరే విధంగా ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని కొత్తదారిలో ఆలోచించి రైతు లోకానికే వెలుగుబాట చూపారు. బోర్లను అనుసంధానం చేసుకోవడానికి అన్నీ కలిపి సుమారు రూ. 10 వేలు ఖర్చవుతుంది. ఆయన చెప్పిన ప్రకారం బోర్ల అనుసంధానం చేసుకునే తీరు ఇదీ. ఈ పద్ధతి విజయవంతం కావాలంటే.. బోర్ల లోతు 150 అడుగులు ఉండాలి. రెండు బోర్ల మధ్య దూరం 35 అడుగులు ఉండాలి. ఈ రెండు బోర్లలో నీరు నేలమట్టం నుంచి 20 అడుగుల లోతులో ఉన్నప్పుడు మాత్రమే అనుసంధానం చేయడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత కాలంలో నీటి మట్టం పడిపోయినా ఇబ్బంది ఉండదు. 1.5 – 1.25 ఇంచుల నీరు పోసే 2 బోర్లను కలిపినప్పుడు చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రభుత్వానికి విద్యుత్‌ ఆదా అవుతుంది. రైతుకు కనీసం రూ. 50 వేలు ఆదా అవుతుంది. రెట్టింపు భూమికి సాగునీరు అందుతుందని పుల్లారెడ్డి తెలిపారు. బోర్ల అనుసంధానానికి కావాల్సిన వస్తువులు: ఎ) 200 అడుగుల పొడవు గల హెచ్‌.డి.పి. పైపు (10 గేజ్, 1.5 ఇంచులు); బి) 36 అడుగుల పొడవైన 8 ఎం.ఎం. ఇనుప చువ్వలు– రెండు; సి) మోపెడ్‌కు వాడే ట్యూబు ఒకటి (అడుగు పొడవైన ముక్కలుగా కత్తిరించి ఉంచుకోవాలి).

హెచ్‌.డి.పి. పైపును మట్టి కింద ఉంచితే మేలు.. 2 బోర్ల మధ్యన హెచ్‌.డి.పి. పైపును నేల పైన ఉంచే కన్నా.. మట్టి లోపలికి ఉండేలా పెట్టుకుంటే కదిలిపోకుండా ఉంటుంది. ఇలా చేయడానికి రెండు బోర్లకు ఉన్న కేసింగ్‌ పైపులను పై నుంచి నేల మట్టం వరకు హెచ్‌.డి.పి. పైపు పట్టే సైజులో కత్తిరించి.. అందులో నుంచి హెచ్‌.డి.పి. పైపును కిందికి దింపితే బాగుంటుంది. సందేహాలుంటే పుల్లారెడ్డి (99632 39182)ని సంప్రదించవచ్చు. పుల్లారెడ్డి తన జ్ఞానాన్ని ఉచితంగా పంచిపెట్టడం వల్ల ఈ సీజన్‌లోనే రైతులందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించిన గొప్ప మనిషి పుల్లారెడ్డి ఆదర్శప్రాయుడని ‘పల్లెసృజన’ అధ్యక్షులు బ్రిగేడియర్‌ (రిటైర్డ్‌) పోగుల గణేశం (98660 01678) అన్నారు. విలక్షణ రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డికి ప్రభుత్వం పింఛనుతో గౌరవించాల్సిన అవసరం ఉంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ బోర్లను అనుసంధానించుకోవడం ఇలా.. 1. తొలుత.. హెచ్‌.డి.పి. పైపును తీసుకొని.. పైపు రెండు చివరలను ఆకాశం వైపు తిప్పి.. గుంజలకు కట్టేయాలి. పైపులో పూర్తిగా నీరు నింపాలి. 2. నీరు నింపిన తర్వాత.. తడి బంక మట్టిని గోనె సంచిలో చుట్టి.. పైపు రెండు చివరల్లోనూ కూర్చాలి. 3. ఆ తర్వాత.. అడుగు పొడవైన ట్యూబు ముక్క ఒక వైపును మూసివేసి తాడుతో గట్టిగా కట్టి, రెండో వైపును.. హెచ్‌.డి.పి. పైపునకు తొడగాలి. హెచ్‌.డి.పి. పైపును బోర్ల లోపలికి దింపే సమయంలో రెండు చివర్ల నుంచి నీరు కారిపోకుండా చూడడానికి రెండు మోపెడ్‌ ట్యూబు ముక్కలను ఉపయోగిస్తున్నామన్న మాట. 4. హెచ్‌.డి.పి. పైపు చివరల్లో తొడిగిన ట్యూబు ముక్కల లోపలికి ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి ఇనుప చువ్వలను కలిపి.. ఆ ఇనుప చువ్వల సాయంతో హెచ్‌.డి.పి. పైపు చివరలను బోర్ల కేసింగ్‌ పైపుల లోపలికి చేర్చాలి. 5. హెచ్‌.డి.పి. పైపు చివరలు రెండు బోర్లలో నీటిలోకి పెట్టిన తర్వాత.. ఇనుప చువ్వలను కిందికి నెడుతూ.. పైపు చివరల్లో తొడిగిన మోపెడ్‌ ట్యూబు ముక్కలను హెచ్‌.డి.పి. పైపుల నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఇనుప చువ్వలను బయటకు తీసేయాలి. పైపును గట్టిగా కుదిపితే.. పైపు చివరల్లో నుంచి బంకమట్టి కూడా బయటకు వచ్చేస్తుంది. 6. బొమ్మలో చూపిన విధంగా.. హెచ్‌.డి.పి. పైపు ఒక చివరను.. మోటారు బిగించిన బోరు కేసింగ్‌ పైపు లోపలికి దశల వారీగా 90 అడుగుల లోతునకు దింపాలి. రెండో చివరను.. మోటారు లేని ఖాళీ బోరు లోపలికి దశల వారీగా 80 అడుగుల లోతునకు దింపాలి. 7. ఈ విధంగా హెచ్‌.డి.పి. పైపును రెండు బోర్ల లోపలికి దింపి నీటితో అనుసంధానం చేసిన తర్వాత మోటారు స్విచ్‌ ఆన్‌ చేయాలి. 8. మోటారు ఆన్‌ చేసిన తర్వాత బోర్ల మధ్య భూమిపైన ఉన్న హెచ్‌.డి.పి పైపుపై చెవిని ఉంచితే నీరు ఒక బోరు లోనుంచి మరో బోరులోకి ప్రవహిస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.

2 views0 comments

Recent Posts

See All
bottom of page